ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న మోదీ సర్కార్ నిర్ణయంపై …సవాలు చేయడానికి సీనియర్ అడ్వొకేట్ ఇందిరా సాహ్నీ

0
40

న్యూఢిల్లీ:

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న మోదీ సర్కార్ నిర్ణయంపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నిర్ణయాన్ని సవాలు చేయడానికి సీనియర్ అడ్వొకేట్ ఇందిరా సాహ్నీ సిద్ధమవుతున్నారు.

indirasawhny

1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇదే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈమే కోర్టులో కేసు వేశారు. దీంతో అప్పట్లో సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించింది.

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అర్హులైన జనరల్ కేటగిరీ అభ్యర్థులు తమ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఇందిరా సాహ్నీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును కోర్టులో సవాలు చేస్తాం. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఆలోచిస్తున్నాను. ఈ బిల్లు రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్లి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం చేస్తుంది కాబట్టి దీనిని కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది అని ఆమె చెప్పారు.

1992లోనూ అప్పటి పీవీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నమే చేస్తే ఎంతో మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని, దీంతో తాను కోర్టులో సవాలు చేసినట్లు ఇందిరా సాహ్నీ వెల్లడించారు.

ఆ కేసుపై ఎన్నో బెంచ్‌లు విచారణ జరపగా.. చివరిగా వెంకటాచలయ్య నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఫేమసైన ఆ కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితిని 50 శాతంగా నిర్ణయించింది.

ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న పీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ధర్మాసనం కొట్టేసింది. వెనుకబాటుతనం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం కుల ఆధారంగా నిర్ణయిస్తారు తప్ప ఆర్థిక పరిస్థితులను బట్టి కాదు అన్నది ఆ తీర్పులోని ప్రధాన భాగం. ఇప్పుడు ఈబీసీ కోటాపై చర్చ సందర్భంగా కూడా ఈ కేసును ప్రతిపక్షాలు లేవనెత్తాయి.