గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకం….నిర్ణయాలు తీసుకోవడంలో క్రియాశీలకం

0
47

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకంగా వ్యవహరిస్తాడు.

నిర్ణయాలు తీసుకోవడంలో సర్పంచ్ క్రియాశీలకంగా ఉంటాడు…..

సర్పంచ్  అధికారాలు.. విధులు..

sarpanch

* గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది.
* గ్రామ కార్యదర్శి నుంచి అవసరమైన సమాచారం తెప్పించుకోవడం, వివిధ దస్ర్తాలను పరిశీలించే హక్కు రాజ్యాంగం కల్పించింది.
* వార్డు సభ్యులు ఆమోదించిన తీర్మానాలను అమలు చేయడం, కార్యనిర్వాహక అధికారిపై పరిపాలన, నియంత్రణ ఉంటుంది.
* అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం పాల్గొనవచ్చు.
* సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపవచ్చు.
* చౌకధరల దుకాణాదారునితో ప్రతి నెలా సమావేశం నిర్వహించి తహసీల్దారుకు నివేదిక అందజేయాలి.
* ఆహార సలహా కమిటీ చైర్మన్‌గా ఉంటారు.
* రేషన్ కార్డుల జాబితాను పొంది, అనర్హుల జాబితాను తహసీల్దార్‌కు అందజేయవచ్చు.
* గ్రామ విద్యాకమిటీ చైర్మన్‌గా వ్యవహరించి పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు.
* స్వయం సహాయ సంఘ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై, పనితీరును మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు అందజేయవచ్చు.

బాధ్యతలివే..

* పంచాయతీ ఆస్తుల పరిరక్షణ బాధ్యత సర్పంచ్‌దే.
* అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి. పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలి. వీధి దీపాలను తక్షణం ఏర్పాటు చేయాలి.
* వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల మంజూరును పర్యవేక్షించాలి.
* స్థానిక ఆరోగ్యకర్తతో కలిసి ప్రజలకు ఆరోగ్య సేవలందించాలి.

నాలుగు స్టాండింగ్ కమిటీలు..కొత్త చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం ప్రతి పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పారిశుధ్యం, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్వాహణకు ఒక స్టాండింగ్ కమిటీ, వీధి దీపాల నిర్వాహణకు మరో కమిటీ, మొక్కలు నాటడం, హరితహారం కోసం మరో కమిటీ, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం మరో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

లే అవుట్, భవన నిర్మాణ అనుమతులు..లే అవుట్ కోసం గ్రామ పంచాయతీలకు వచ్చే దరఖాస్తులను సంబంధిత హెచ్‌ఎండీఏ, డీటీసీసీ లేదా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు వారం రోజుల్లోగా పంచాయతీలు విధిగా పంపించాల్సి ఉంటుంది. ఏ కారణంగా నైనా వారంలోగా దరఖాస్తులను పంచాయతీ పంపకపోతే వాటిని పంపించినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టం లో పొందుపరిచారు. 30రోజుల్లో సంబంధిత అథారిటీ కూడా లే అవుట్‌పై నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో లే అవుట్‌కు ఆమోదం లభించినట్లుగానే పరిగణించడం జరుగుతుందని చట్టంలో నిబంధన పొందుపరిచారు. జీప్లస్ టూ వరకు గ్రామ పంచాయతీలు, ఆపైన నిర్మించే భవనాలకు హెచ్‌ఎండీఏ, డీటీసీసీ లేదా అర్బన్ డెవలప్‌మెం ట్ అథారిటీలు 15రోజుల్లో విధిగా అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించడం చేయాలని చట్టంలో పేర్కొన్నారు. తద్వారా లే అవుట్ భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నూతన పంచాయతీ రాజ్ చట్టం అవకాశం కల్పించనున్నది.

ప్రతినెలా పాలకవర్గ సమావేశం..గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ప్రతినెలా పాలకవర్గ సమావేశాన్ని కొత్త చట్టం ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు నెలలకు ఒకసారైనా మండల పంచాయతీ విస్తరణ అధికారి (ఈవో పీఆర్డీ) ప్రతి పంచాయతీని తనిఖీ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ప్రతినెలలో కనీసం ఐదు పంచాయతీలను జిలా ్లపంచాయతీ అధికారి కూడా తనిఖీ చేయాలి. పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించాలి.

పంచాయతీకి కో ఆప్షన్ సభ్యుల నియామకం..మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల తరహాలోనే గ్రామ పంచాయతీ ల్లో కూడా ఇక నుంచి కోఆప్షన్ సభ్యులు ఉండనున్నారు. వివిధ రంగాలకు చెందిన వారిని కోఆప్ష న్ సభ్యులుగా నియమించుకోవడం ద్వారా వారి సలహాలు, సూచనలతో గ్రామాభివృద్ధిలో వేగం పెరుగుతుందనే ఆలోచనతో చట్టంలో ఈ అవకాశం కల్పించారు. ఒక రిటైర్డ్ ఉద్యోగి లేదా సీనియర్ సిటిజన్‌ను కోఆప్షన్ సభ్యుడిగా నియమించుకునే అవకాశం పాలకవర్గానికి ఈ చట్టం ద్వారా కలుగుతుంది. గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఎవరు ఉంటే వారు పంచాయతీ కోఆప్షన్ మెంబర్‌గా ఎంపిక అవుతారు. గ్రామాభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే ఎన్‌ఆర్‌ఐలు గానీ ఇతర ప్రముఖులను గానీ మూడో కోఆప్షన్ సభ్యుడిగా పాలకవర్గం నియమించుకునే అవకాశం కల్పించారు.