తమిళనాడులో తిరునేల్ వేలి కలెక్టర్ తమ కూతురును అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించారు.

0
44

చెన్నై :

శభాష్…కలెక్టర్ శిల్ప ప్రభాకర్ సతీష్

తిరునేల్ వేలి కలెక్టర్ శిల్ప ప్రభాకర్ సతీష్ తన కుమార్తెను ప్లే స్కూల్లో చేర్పించకుండా అంగన్ వాడీ సెంటర్లో చేర్పించారు.

Tamil-Nadu-Tirunelveli-Collector-Shilpa

నీతులు చెప్పడం వేరు, ఆచరించి చూపడం వేరు. చెప్పింది చేసి చూపించాలి. లేకపోతే చెప్పకూడదు. తెలుగు భాష మాధుర్యం, స్వీట్  హాట్, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని చెబుతున్న నేతలు తమ పిల్లలను లక్షలు పోసి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివిస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్న నేతలు తమ వారసులను మాత్రం కార్పొరేట్ స్కూళ్లకే పంపుతున్నారు. అందుకే వారి మాటలను జనం పట్టించుకోవడం లేదు. అయితే అందరూ అలాగే వుండరు. కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్ లాంటి వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారు చెప్పేది, చేసేదీ ఒకటే.

తమ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్ అందించాలని.. ప్రయివేటు స్కూళ్లల్లో చదివించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు కోరుకుంటారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం తన బిడ్డను అంగన్ వాడీ సెంటర్లో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మూడు, నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ప్లే స్కూల్స్ లో చేర్పిస్తారు. కానీ తిరునేల్ వేలి కలెక్టర్ శిల్ప ప్రభాకర్ సతీష్ తన కుమార్తెను ప్లే స్కూల్లో చేర్పించకుండా అంగన్ వాడీ సెంటర్లో చేర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శిల్ప మాట్లాడుతూ.. సమాజంలోని అందరి పిల్లల మాదిరిగానే తన బిడ్డను పెంచాలనుకుంటున్నానని, అన్ని వర్గాలతో కలిసిపోయే విధంగా తన కుమార్తె పెరగాలని చెప్పారు. ఈ కారణంతోనే తాను నర్సరీ స్కూల్ స్థానంలో అంగన్ వాడీ సెంటర్ ను ఎంపిక చేసుకున్నానని స్పష్టం చేశారు. మిగతా నర్సరీ స్కూళ్లతో పోల్చితే.. ఈ అంగన్ వాడీ సెంటర్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. శిక్షణ పొందిన టీచర్లు ఉన్నారు. ఇంతకన్న ఏం కావాలన్నారు కలెక్టర్. అంగన్ వాడీ సెంటర్లను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నామని కలెక్టర్ శిల్ప చెప్పారు.