తెలంగాణ రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలి….. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

0
69

hyderabad, sircilla srinivas, 9849162111

తెలంగాణ రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రూ.2.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

kcr11

తెలంగాణ రైతులకు సాగునీరు అందించడానికన్నా మించిన ప్రాధాన్యత మరొకటి లేదని, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, వెంట వెంటనే బిల్లులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించడంతో పాటు, పెద్దవాగు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమగ్ర వ్యూహం రూపొందిచుకుని నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.

kcr22

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సిఎస్ శ్రీ ఎస్.కె.జోషి, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్సి శ్రీ మురళీధర్, ఓఎస్డీ శ్రీ శ్రీధర్ దేశ్ పాండే, సిఇలు శ్రీ హరిరామ్, శ్రీ శంకర్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఇ.లు శ్రీ విష్ణు ప్రసాద్, శ్రీ వేణు, ఇఇ శ్రీ రామకృష్ణ, ఎమ్మెల్సీ శ్రీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు రూ.77,777 కోట్ల ఖర్చు జరిగింది. భూ సేకరణ, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం, ఆర్ఆర్ ప్యాకేజిల కోసం మరో రూ.22వేల కోట్ల ఖర్చు జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.99,643 కోట్ల ఖర్చు జరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి మరో రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా వ్యయం జరుగుతుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని ప్రాజెక్టులతో పాటు, మిషన్ కాకతీయ పనుల కోసం మరో రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ నిధులు ఖర్చు చేసి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజన్సీలు కృషి చేయాలి. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, వెంటవెంటనే నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘‘సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులు ఓ జోక్ గా మారాయి. ఎన్నికలప్పుడు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోవడమే తప్ప, ప్రాజెక్టులు కట్టి నీళ్లివ్వలేదు. అత్యధిక వర్షపాతం, పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర మార్చాలి. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలి. తమ్మిడిహట్టి బ్యారేజి నిర్మించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో 56,900 ఎకరాలకు, ఆసిఫాబాద్ లో 38,830 ఎకరాలకు, చెన్నూరులో 31,500 ఎకరాలకు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 72,770 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించి, 20 టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి సి.డబ్ల్యు.సి. అంగీకారం తెలిపింది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుని, ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. ఆదిలాబాద్ జిల్లాలో పారే పెద్దవాగుకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చాలా నియోజకవర్గాల గుండా వెళుతుంది. ఈ పెద్ద వాగు నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. పెన్ గంగ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న చనఖా-కొరటా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి. కుప్టి రిజర్వాయర్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘తమ్మడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం, చనఖా-కొరటా ప్రాజెక్టు, పెద్దవాగు సద్వినియోగం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు సాగునీరు అందుతుంది. మిగిలిన భాగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు పారుతుంది. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్ లో తెలంగాణకున్న వాటాను పూర్తిగా వినియోగించుకోవాలి. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నేను స్వయంగా పరిశీలించాను. నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టు పనులను సందర్శించారు. మొత్తం గోదావరి బేసిన్ లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ అవగాహనతో ఈ నెలాఖరులోగా కార్యాచరణ ఖరారు చేయాలి. ఫిబ్రవరిలో నేనే స్వయంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తాను. ఫిబ్రవరి మాసంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై కార్యాచరణ రూపొందిస్తాం. వర్షాకాలం వరకు వేగంగా పనులు చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి వెంటనే కార్యరంగంలోకి దిగాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని మొట్టమొదట చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్.ఆర్.ఎస్.పి వరకు, ఇటు మల్లన్న సాగర్ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట చెరువులను మళ్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు కాల్వలపై తూములు నిర్మించి, చెరువులను నీరు మళ్లించాలన్నారు. ఏదైనా చెరువుకు ఫీడర్ ఛానల్ లేకుంటే, కొత్తగా కాల్వ తవ్వాలని ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. రెండో దశ వరకు చెరువులు నింపాలని చెప్పారు.