నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టకపోవడంతో ఓ తల్లి రోడ్డెక్కింది….

0
90

జగిత్యాల :

నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన కొడుకులు నిర్దయతో, బుక్కెడు బువ్వ  పెట్టకపోవడంతో ఓ తల్లి రోడ్డెక్కింది.

వృద్ధాప్యంలో ఉన్న తనను, కొడుకులు పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడం ప్రజలను కంటతడి పెట్టించింది.

IMG-20190103-WA0402

వివరాల్లోకి వెళితే …జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన నలమాసు లచ్చమ్మకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కాగా ఒక కొడుకు చనిపోయాడు.

లచ్చమ్మకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఇంటితో పాటు విలువైన భూమలున్నాయి.

కాగా అంగడి బజార్ ప్రాంతంలో లచ్చమ్మకు చెందిన ఇంటిని కొడుకులు అద్దెకిచ్చి ప్రతినెలా అద్దె వసూలు చేసుకుంటున్నారు.

లచ్చమ్మ తన ఇంటి వరండాలోనే చలిలో వణుకుతూ కాలం వెల్లదీస్తున్నా కొడుకులెవరూ పట్టించుకోకపోవడంతో లచ్చమ్మ ఇంట్లో అద్దెకుంటున్న వారే ప్రతిరోజూ అన్నం పెడుతున్నారు.

దీంతో తన కొడుకులు బుక్కెడు బువ్వ  పెట్టడం లేదంటూ గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తనకు న్యాయం జరగలేదంటూ జిల్లా కేంద్రంలోని అంగడి బజార్‌లోని మార్కండేయ దేవాలయ కమాన్ వద్ద రోడ్డుపై బైఠాయించి కోట్ల విలువైన ఆస్తిపాస్తులను పంచుకున్న కొడుకులు తనకు పిడికెడు అన్నం పెట్టడానికి ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు లచ్చమ్మను సముదాయించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. తనకు న్యాయం చేయాలని లచ్చమ్మ పోలీసులను కోరింది.