మన పండుగలు ఐకమత్యానికి ప్రతీకలని, సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయ

0
83

 

  • సంప్రదాయ పండుగలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి…ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Paradeground1

సంప్రదాయ పండుగలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు…

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌం డ్‌లో మూడురోజులపాటు కొనసాగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.

kite-festival (1)

దేశ, విదేశీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హైదరాబాద్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని, ఈ వేడుక మన దేశ వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలిచిందని పేర్కొన్నారు.

Paradeground

మన పండుగలు ఐకమత్యానికి ప్రతీకలని, సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని ఆకాంక్షించారు. కైట్ ఫెస్టివల్ నాలుగో వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.

Paradeground2

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలం నేలమీదే ఉందని పతంగులు గుర్తుచేస్తాయన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుందని, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఒకేచోటుకు చేరుకొని సం తోషంగా గడుపుతారని చెప్పారు.

భారతీయ సంస్కృతిని, జీవన పద్ధతులను, మన ఆహార అలవాట్లను నేటి తరం అవగాహన చేసుకోవాలని, వాటి పునర్జీవానికి కృషిచేయాలని కోరారు. పాశ్చాత్య సంస్కృతిని వీడి మన మూలాలకు తరలివెళ్దామని పిలుపునిచ్చారు. అందరూ ఆరోగ్యంగా జీవించాలని, చేదు, తీపి.. ఇలా అన్ని రుచులను అనుభవించాలని సూచించారు. క్రీడలు మన ఆరోగ్యాన్ని, సహనాన్ని పెంచుతాయని చెప్పారు. పతంగులు ఎగురవేయడం ద్వారా మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి వేడుకలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు. నలుడు, భీముడు మొదలుకొని భారతీయుల్లో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారని, మన దేశంలో ఎన్నో ప్రామాణిక శాస్త్రాలు పుట్టాయని గుర్తుచేశారు. అన్ని రకాల వంటల గురించి, అవి తినడం వల్ల కలిగే లాభాల గురించి సుకేశ ముని రచించిన సూప శాస్త్రం గురించి ప్రస్తావించారు. మన ఆహార అలవాట్లను, సంప్రదాయాలను వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులెత్తడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల వారికి మన తీపి రుచులను పరిచయం చేస్తూ అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించడం అద్భుతమని ప్రశంసించారు. ఓవైపు కైట్స్, మరోవైపు స్వీట్స్.. ఇదో అరుదైన కాంబినేషన్ అని చెప్పారు.

హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి: స్వామిగౌడ్

పతంగుల పండుగతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. స్వీట్స్ ఫెస్టివల్‌లో వివిధ ప్రాం తాల రుచులు కొలువుదీరడం సంతోషకరమన్నారు. ఇది ప్రతిఒక్కరూ వీక్షించాల్సిన కార్యక్రమమని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మూడురోజుల పతంగుల పండుగ అందరిలోనూ ఉత్సాహం నింపుతుందన్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి రావడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభు త్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజంశాఖ ఇంచార్జి కమిషనర్ దినకర్‌బాబు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, వరల్డ్ కౌన్సిల్ టూరిజం ప్రెసిడెంట్ జంగ్, మేజర్ జనరల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పరేడ్‌గ్రౌండ్స్‌కు పోటెత్తిన ప్రజలు

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను తొలిరోజు తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు. ఓవైపు ఆకాశంలో రంగురంగుల పతంగులు, మరోవైపు నోరూరించే తీపి పదార్థాలను ఆస్వాదించేందుకు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నైట్ కైట్ ఫెస్టివల్‌ను ఆదివారం సాయం త్రం పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించారు. ప్రధాన వేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 20 దేశాల నుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 60 మంది దేశవాళీ క్లబ్ సభ్యులు, పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ ఫెస్టివల్ సోమ, మంగళవారాల్లోనూ కొనసాగనున్నది.

నోరూరిస్తున్న 1200 రకాల స్వీట్లు

కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్‌లో ఘుమఘుమలాడే తీపి పదార్థాలు సందర్శకుల మనసును దోచేశాయి. పలు దేశాలు, రాష్ర్టాలకు చెందిన స్వీట్లతో స్వీట్ లవర్స్ పండుగ చేసుకున్నారు. దాదాపు 1200 రకాల స్వీట్లు ఒకే వేదికపైకి చేరడంతో ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రాష్ర్టాలకు చెందిన మహిళలు స్వయంగా స్వీట్లను తయారుచేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా వారి సంప్రదాయ వస్త్రధారణ మరో ఆకర్షణగా నిలిచింది. ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సాయంత్రం వరకే పలు స్వీట్ స్టాళ్లు ఖాళీ అయ్యాయి.
Paradeground2
Paradeground3