రాష్ట్రప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్, రెండో ప్రాధాన్యం రోడ్లు…సీఎం కేసీఆర్

0
42

హైదరాబాద్ :

  • రానున్న మూడేళ్లలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు నీరందించబోతున్నాo…
  • అన్ని గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు…
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మేము ప్రకటించిన అన్ని హామీలు అమలు…
  • వచ్చే ఐదేళ్లలో తెలంగాణ సమకూర్చుకునే ఆదాయం, పెట్టే ఖర్చు రూ.10 లక్షల కోట్లపైనే..
  • ఈ ఐదేళ్లలో 2 లక్షల 40 వేల కోట్లు అప్పు చెల్లించాలి…
  • ఆయుష్మాన్ భారత్ కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీనే బాగా ఉంది…
  • కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు

CM-KCR

రాష్ట్రప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్ అని, రెండో ప్రాధాన్యం రోడ్లు అని, రానున్న మూడేళ్లలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు నీరందించబోతున్నామని, కొత్తగా ఏర్పడిన అన్ని గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్టాడుతూ..సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.99 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.లక్షా 17 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మనకు కేటాయించిన నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతుల సంక్షేమాన్ని చూనే బాధ్యత భూ యజమానులే తీసుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

మా రెండో ప్రాధాన్యం రోడ్లు..కొత్తగా ఏర్పడిన అన్ని గ్రామపంచాయతీలకు బీటీ రోడ్లు వేస్తమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పాత రోడ్లు అద్దాళ్లాగా తీర్చిదిద్దేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మేము ప్రకటించిన అన్ని హామీలు అమలు చేస్తం. నిరుద్యోగ భృతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి..ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేస్తం. శాంతిభద్రతలు అద్భుతంగా అమలు కావడం మాకు గర్వకారణం. పోలీస్ కమాండ్ కంట్రోల్ అన్ని విభాగాలను సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24వేల కోట్ల నిదులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ కేంద్రం మనకు రూ.24 కూడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు.

వచ్చే ఐదేళ్లలో తెలంగాణ సమకూర్చుకునే ఆదాయం, పెట్టే ఖర్చు రూ.10 లక్షల కోట్లపైనే ఉంటది. ఈ ఐదేళ్లలో 2 లక్షల 40 వేల కోట్లు అప్పు చెల్లించాలి. నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అభివృద్ధి పనులకు ఉంటాయని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న సభ్యులందరికీ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆయుష్మాన్ భారత్ కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీనే బాగా ఉంది…

కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వం వాటా ఏమాత్రం లేదని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కేసీఆర్ కిట్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెచ్చిన ఆరోగ్య పథకం చాలా మంచి పథకమని అన్నారు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బాగా ఉంది. అందుకే ఆయుష్మాన్ భారత్ లో చేరమని ప్రధానికి చెప్పాం. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వాల హక్కు తప్ప దయాక్షిణ్యం కాదన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఉంది. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే నంబర్ 1గా ఉన్నామన్నారు.

చాలా మంచి ఉద్దేశంతో ఎవరూ అడగకుండానే కంటివెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.