వెనుకబాటుతనానికి కులమే అత్యుత్తమ ప్రాతిపదిక….50 శాతం పరిమితి అనేది కేవలం కుల రిజర్వేషన్లకే – కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

0
77

న్యూఢిల్లీ:

అగ్ర వర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు సోమవారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. మంగళవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం విశేషం.

Arun-Jaitley

ఎంతో కీలకమైన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని లోక్‌సభ చర్చిస్తున్నది…. ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. దీనికి రాష్ర్టాల అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పారు. 50 శాతం పరిమితి అనేది కేవలం కుల రిజర్వేషన్లకే అని ఆయన తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. వెనుకబాటుతనానికి కులమే అత్యుత్తమ ప్రాతిపదిక అని అన్నారు.

అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితి అన్నది ఆర్టికల్ 16 (4) ప్రకారం నిర్ణయించారని చెప్పారు. అందుకే తాము ఆర్టికల్ 15, 16 ఆర్టికల్స్‌కు సవరణ చేసి ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూస్తామని తెలిపారు.

ప్రతి పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందని, కానీ అవన్నీ చట్టం వెనుక దాక్కున్నాయని జైట్లీ అన్నారు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఆర్థికంగా అణగారిన వర్గాలు వెనుకబడుతున్నారని, వాళ్లను పైకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని జైట్లీ చెప్పారు.

అయితే ఈ బిల్లును ఇంత అర్జెంటుగా సభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ తప్పుబట్టారు. ఇంత ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై తొందరపాటు పనికి రాదని ఆయన సూచించారు. తాము బిల్లుకు వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం దానిని ప్రవేశపెట్టిన తీరుపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఇంత హడావిడిగా బిల్లును తీసుకురావడం చూస్తుంటే.. మీడియా అనుమానం వ్యక్తం చేసినట్లు ఇది కేవలం పోల్ జిమ్మిక్కుగానే కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు.

1991లోనూ పీవీ సర్కార్ ఇలాగే చట్టం తీసుకురావాలని చూస్తే సుప్రీంకోర్టు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని కచ్చితంగా జేపీసీకి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీలాగే ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొక తప్పిదం చేస్తున్నదని థామస్ విమర్శించారు.