స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనమే…రాష్ట్ర శాసనసభ సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు

0
102

హైదరాబాద్:

రాష్ట్ర శాసనసభ సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.

pocharam

మొత్తం ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్, మల్లు భట్టి విక్రమార్కతో పాటు అహ్మద్ బలాల, రేఖా నాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్.. పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.

సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో ఎంఐఎం, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ స్పీకర్ ఏకగ్రీవానికి ఆమోదం తెలిపాయి. దీంతో స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనమే. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

నలభై ఏండ్ల రాజకీయ ప్రస్థానం..
పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో ఆరుసార్లు పోటీ చేసి, ఐదుసార్లు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా సీనియర్ రాజకీయ నాయకుడిగా కొనసాగుతు న్నారు. 1976లో రాజకీయాల్లో అడుగు పెట్టిన పోచా రం 1977 లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. 1994లో తొలిసారి బాన్సువాడ నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. 1998లో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనులు, జలవనరులశాఖ మంత్రి గా పనిచేశారు. కొంత కాలం పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో 49 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పనితీరుతో లక్ష్మీపుత్రుడిగా సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బాన్సువాడ నియోజకవర్గం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.