తొలిసారిగా భారత్‌లో అధికార పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్

0
99

న్యూఢిల్లీ:

భారత్ అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదరనుంది. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ఈ నెలాఖరులో తొలిసారిగా భారత్‌లో అధికార పర్యటనకు రానున్నారు.

ఈ సందర్భంగానే ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని బహుళ వర్గాలు తెలిపాయి. నిర్థిష్ట రంగాలకు సంబంధించి ఈ వాణిజ్య ఒప్పందం ఉంటుంది. దీనికి సంబంధించి తుది రూపురేఖలను ఇరు దేశాల అధికారులు ఇప్పుడు రూపొందిస్తున్నారు. ఈ నెల 23 నుంచి 26 మధ్యలో ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు వస్తున్నారు.

ఇందుకు తగు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ పర్యటన సందర్శన ప్రాంతాలకు అధికార యంత్రాంగం ఇప్పుడు తుది రూపు ఇస్తోంది. అమెరికా అధ్యక్షుడి పర్యటన ప్రధాన భాగం అంతా కూడా దేశ రాజధానిపైనే కేంద్రీకృతం అవుతుంది.

అయితే దేశంలోని మరో నగరానికి స్వల్పకాల పర్యటనకు వెళ్లే విషయం కూడా ఆలోచిస్తున్నారు. మరో చోటికి కూడా పోవాలనుకుంటే ఏ నగరానికి వెళ్లాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఆగ్రా లేదా అహ్మదాబాద్‌కు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం ప్రధానమైతే, అంతే ప్రాధాన్యతాక్రమంగా రక్షణ, భద్రత రంగంలో సహకారం ఇనుమడింపచేసుకునే మరో ఒప్పందం కూడా కుదురుతుందని వెల్లడైంది. ఇక తమ సరుకులపై అమెరికా సుంకాల విధింపు గురించి భారతదేశం నిరసన వ్యక్తం చేస్తోంది. అత్యధిక పన్నుల నుంచి వీటిని తప్పించాలని కోరుతోంది. ఉక్కు, అల్యూమినియం, జిఎస్‌పి పరిధిలో టారీఫ్‌ల ప్రయోజనాల కొనసాగింపు వంటి వాటిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు.

ఇక భారతదేశ వ్యవసాయ, ఆటోమొబైల్, ఆటో పరికరాలు, ఇంజనీరింగ్ విడిభాగాలకు అమెరికాలో మరింత మార్కెట్ వాతావరణం కల్పించాలని కూడా పట్టుపట్టనున్నారు. ఇక అమెరికా కూడా భారత్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచనుంది.

వ్యవసాయ, అమెరికా సరుకులు, డెయిరీ ఉత్పత్తులు, వైద్య పరికరాలకు సరైన విక్రయాలు ఉండేలా చూడాలని కోరనుంది. ఈసారి గణతంత్ర దినోత్సవాలకు ప్రధాన అతిథిగా రావాలని ట్రంప్‌ను భారత ప్రధాని మోడీ ఆహ్వానించారు. అయితే స్వదేశంలో తీరిక లేకుండా ఉండటంతో అది వీలు కాలేదు.

ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారం పర్యటన ఖరారు అయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు వెళ్లుతున్నారు. ప్రస్తుతం అభిశంసన పర్వంలో ఉన్నారు. గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ట్రంప్ భారత్ పర్యటనకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here