ఆ ఐదుగురమ్మలకు శతధా సహస్ర వందనాలు….

0
2073

శతధా సహస్ర వందనాలు….తెలంగాణ రిపోర్టర్

  • అమ్మలా ఆదరిస్తున్నారు…
  • ఆప్యాయతతో అనురాగం పంచుతున్నారు…
  • విద్యా బుధ్దులు నేర్పిస్తున్నారు….

ఇంతకన్నా ఎవరికైనా ఇంకేం కావాలి…అదీ అమ్మా-నాన్న, నా అనే వారెవరూ లేని వారికి ఆపన్న హస్తం అందిస్తున్న ఆ మానవతా మూర్తులకు మనసున్న ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు…దాతృత్వం గావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే… రెండు దశాబ్దాల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ఐదుగురు విద్యావంతులైన మహిళలు ఒక పవిత్ర ఆశయంతో , మంచి సంకల్పంతో..ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థ రాష్ట్ర సేవికాసమితి సహకారంతో….జగిత్యాల వైద్యుల సహకారంతో… ఆరంభించిన ఆవాసం ఆ అనాధలైన ఆడ పిల్లలకు నీడ నిచ్చి అక్కున చేర్చుకుంటుంది.

ఆడపిల్లలకు వరంగా మారిన ఈ ఆవాసం నిర్వాహకులు, సంకల్పించిన మానవతామూర్తుల్లో…ఐదుగురు మహిళలూ వైద్య కుటుంబానికి చెంది, గృహస్థులుగా ఉంటున్నవారే.

ఇతరత్రా వేరే వ్యాపకాలకు పోకుండా…ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న…అనే నమ్మకంతో పట్టణానికి చెందిన శ్రీమతి భీమనాతిని ఉమాదేవిశంకర్, శ్రీమతి రేణుకా రావుమధుసూదన్ రావు, శ్రీమతి వి. గిరిజసత్యనారాయణమూర్తి, శ్రీమతి కాలువ సునంద వెంకట రాజిరెడ్డి, శ్రీమతిమీనాక్షి రత్నాచార్యులు కలిసి ఒక పవిత్ర ఆశయంతో గత 1997లో భగిని నివేదిత ఆవాసం పేరిట, అనాధ ఆడపిల్లల కోసం ఒక నీడను ఏర్పాటు చేశారు.

ఈ పవిత్ర కార్యక్రమం కోసం సరస్వతీ విద్యాపీఠం అనుబంధ సంస్థ గీతావిద్యాలయం సైతం చేయూతనందించి, ఆవాసం ఏర్పాటు కు సహకరించారు.

ఇక రెండు దశాబ్దాలుగా నిరంతరంగా,నిరాటంకంగా సాగుతున్న ఈ భగినీ నివేదిత ఆవాసం నిర్వహణ కోసం ఎందరో దాతలు ముందుకు రావడం జరిగింది.

వీరిలో ప్రధానంగా, జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ జగన్ ఐల్నేని

Telangana Reporter with Dr.Jagan Ilneni

అనాధ ఆడపిల్లలకు సాయం అందించడానికిగాను, ఆవాసం నిర్మాణం కోసం స్పందించి,10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.

ఆయనతో పాటు ఆవాసం పిల్లల కోసం ఐదుగురు మహిళల కుటుంబ సభ్యులు , డా.మధుసూదన్ రావు-రేణుకారావు దంపతుల కుమార్తెలు, డా.వెంకట్ రాజిరెడ్డి-సునంద దంపతుల కూతురు అమెరికాలో ఉంటూ, తమ తల్లితండ్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆవాసంకు ప్రతి సంవత్సరం కనీసం 25 వేల నుండి 50 వేల వరకు విరాళంగా తమవంతుగా అందిస్తున్నారు.

కాగా, ప్రతి సంవత్సరం కనీసం 5 లక్షల నుండి 6 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నట్లు మహిళా నిర్వాహకులు తెలిపారు. ఉచిత భోజన వసతితో పాటు ఉచిత విద్యను అందిస్తూ, వారిని తీర్చిదిద్దాలన్నది ఈ భగిని నివేదిత ఆవాసం మహిళల లక్ష్యం.

కొందరు మానవతా మూర్తులు ఇప్పటి వరకు సుమారు 30 లక్షలకు పైగా విరాళాలు అందించారు. ఎన్ ఆర్ ఐ, శ్రీమతి రేణుకారావు సమీప బంధువు డా.మురళి తనవంతుగా ఆవాసంలో విద్యుత్ సౌలభ్యం కోసం రూ.2 లక్షల వ్యయంతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్నారు.

ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా అనాధ బాలికలను అక్కున చేర్చుకుని.. అమ్మలా లాలిస్తూ… వారికి చదువుతో పాటు విలువైన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.

ఈ ఆవాసంలో అభ్యాసం చేసిన విద్యార్థులు వైద్య, సాంకేతిక విద్యతోపాటు డిగ్రీ చదువు పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. తమకు మంచి విద్యను అందించి, అమ్మలా అక్కున చేర్చుకున్న ఆవాసంను, ఆ అమ్మలనూ మరచిపోలేకుండా అంతో ఇంతో సాయపడుతున్నారు.

భగిని నివేదిత ఆవాసంలో ఐదుగురు మహిళల ఆశయం వెనుక ఆడపిల్లల అమానవీయ సంఘటనలు ఎన్నో వారిని కదిలించాయి.. మంచి చెడు చెప్పే అమ్మానాన్నలకు దూరమైన ఆడపిల్లల రక్షణ బాధ్యతకు ఆ మహిళలు నడుంబిగించారు. వారు ఎంచుకున్న ఈ సదాశయం ఎందరో ఆడపిల్లల జీవితాలను మలుపు తిప్పుతుంది.

అనాధ ఆడపిల్లల సంరక్షణయే ధ్యేయంగా ఏర్పాటైన ఈ భగిని నివేదితఆవాసంకు కాకాజీ అనే మరో దాత ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు . మహిళలు స్వచ్చందంగా విరాళాలు సేకరించి ఆడపిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

భగిని నివేదిత ఆవాసంలో ఆడపిల్లలకు రక్షణగా… అమ్మలా చేదోడువాదోడుగా ఉంటున్న ఈ ఆవాసంలో జగిత్యాల ప్రాంతం నుంచే కాకుండా ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా అనాధ ఆడపిల్లలు ఈ భగిని నివేదిత ఆవాసంలో తమ జీవితాన్ని గడుపుతున్నారు.

ఆవాసం లోని ఒక్కో ఆడపిల్ల పరిస్థితిని పరిశీలిస్తే.. ఒక్కో వ్యధ మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. కాగా, ఈ ఐదుగురు మహిళల్లో శ్రీమతి ఉమాదేవి కొద్ది రోజులనుండి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండడంతో ఆమె స్థానంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీమతి మెన్నేని నీలిమ భాగస్వామ్యం అవుతుంది.

ఏది ఏమైనా…ఒక పవిత్ర ఆశయంతో ఐదుగురమ్మలు ఏర్పాటు చేసిన భగినీ నివేదిత ఆవాసం మంచి ఫలితాలనిస్తుండడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తూ…మేము సైతం…ఈ సామాజిక యజ్ఞంలో భాగస్వాములమవుతాం…అంటూ దాతృత్వం ప్రకటిస్తూ…ముందుకు వస్తున్నారుఅనాధ ఆడపిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు..అమ్మ ఒడిలా ఆదరిస్తున్నారు…

మరోసారి ఈ ఐదుగురమ్మలకుతెలంగాణ రిపోర్టర్శతధా సహస్ర వందనాలు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here