ఈ నెల 17న ప్రధాని మోడీ జన్మదినం: దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

0
142

జగిత్యాల జిల్లా:

భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17 ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా “సేవ సప్తాహ” పేరుతో  వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం జగిత్యాల శివ సాయి హోటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్ని రాజకీయ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ భిన్నమైందన్నారు. కేవలం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకుండా సామాజిక స్పృహ కలిగిన ఏకైక పార్టీ బిజెపి యే నన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ 69 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బిజెపి పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, నరేంద్ర మోడీ అభిమానులు ఈ సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయని అయితే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందన్నారు. ప్రజలకు మరింత చేరువ కావడం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు. మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన పర్యావరణ పరిరక్షణకోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారని, ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

గతంలో ప్రారంభించిన స్వచ్ఛభారత్ ఉద్యమంలో అనేక మంది పాల్గొని విజయవంతం చేశారని, అదే రీతిలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోడీ చేపట్టిన మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని కోరారు. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రచార ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని కార్యకర్తలను కోరారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో చైతన్యం కలిగించి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గిస్తామని ప్రతిజ్ఞలు నిర్వహించాలని సూచించారు.

సేవ సప్తాహం లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, సహజ వనరుల సంరక్షణ కోసం ప్రచార కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాలను వారం రోజుల పాటు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.

ఏకాత్మతా మానవతావాద మే లక్ష్యంగా ప్రతి భారతీయ పౌరుని సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుందని ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి..

తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అమరవీరుల ఆత్మ శాంతి కోసం విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవంపై ప్రశ్నించిన కేసీఆర్   తాను అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మరచిపోయారన్నారు.

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలు కేవలం ఓవైసీ సోదరులకు భయపడే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. విమోచన దినోత్సవం ముస్లింలకు వ్యతిరేకం కాదని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. విమోచన దినోత్సవాన్ని జరపడం ద్వారా అమరవీరుల  ప్రాణత్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సిగ్గు,పౌరుషం,చేవ  ఉంటే మంత్రి పదవుల కోసం కెసిఆర్ ను ప్రశ్నించడం కాదని  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రశ్నించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించ కుంటే బిజెపి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తామే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అశోక్ రెడ్డి,నాయకులు సీపెల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, గుడాల రాజేష్ గౌడ్, అరవ లక్ష్మి, రమణారెడ్డి, ఆముద రాజు, గోపాల్ రెడ్డి, దశరథ రెడ్డి, జున్ను రాజేందర్, గంగాధర్  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here